సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన ఐఏఎస్‌లు

vartha vihari : అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని 2019-బ్యాచ్‌ ఏపీ కేడర్‌కు చెందిన ప్రొబేషనరీ ఐఏఎస్‌లు శనివారం ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా యువ ఐఏఎస్‌ అధికారులను సీఎం అభినందించారు. నిబద్ధత గల అధికారులుగా ప్రజలకు మంచి సేవలందించి, ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని సీఎం వైఎస్‌ జగన్‌ కోరారు. ప్రభుత్వ పథకాల అమల్లోనూ, ప్రజా సమస్యల పరిష్కారంలో ఐఏఎస్‌లదే కీలకపాత్ర అని.. చిత్తశుద్ధితో పనిచేయాలని సీఎం సూచించారు.
(కరోనా సోకడం నేరమేమీ కాదు: సీఎం జగన్‌)

మహిళా సాధికారతకు పెద్దపీట..
మహిళా సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా ఓ మహిళేనని, మహిళల రక్షణ కోసం దేశంలో మరెక్కడా లేని విధంగా దిశా చట్టాన్ని తీసుకురావడంతో పాటు ప్రత్యేక పోలీసు స్టేషన్లు ఏర్పాటును యువ అధికారులకు సీఎం వివరించారు. వాలంటీర్ల వ్యవస్థ, మహిళాసాధికారత కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల పై ముఖ్యమంత్రితో చర్చించామని యువ ఐఏఎస్‌లు తెలిపారు. ముస్సోరిలోని తమ శిక్షణ లో కూడా  గ్రామ సచివాలయాలు,  వాలంటీర్ల వ్యవస్థతో పాటు అధికార వికేంద్రీకరణ పై కూడా పలు మార్లు చర్చ జరిగిందని ప్రొబెషనరీ ఐఏఎస్‌లు పేర్కొన్నారు.
(‘ఆ ఘనత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానిదే’) 

‘‘గాంధీ చెప్పిన గ్రామ స్వరాజ్యం గ్రామ సచివాలయాల ద్వారా సాధ్యమవుతుంది. మహిళాభివృద్ధి మీద ప్రభుత్వం మంచి చిత్తశుద్ధితో ఉంది. నిన్నటి వరకు పరిపాలనకు సంబంధించి అనేక అంశాలు నేర్చుకున్నాం. ఇప్పుడు నేరుగా ప్రాక్టికల్‌గా తెలుసుకోబోతున్నామని’’తెలిపారు. కొత్తగా అమలు చేస్తున్న గ్రామ వాలంటీర్ల వ్యవస్థ అధికార వికేంద్రీకరణ వంటి  కొత్త వ్యవస్థలో పనిచేయడం పట్ల యువ ఐఏఎస్ అధికారులు హర్షం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌ను కలిసిన వారిలో ఎం.నవీన్‌, నిధి మీనా, చహత్‌ బాజ్‌పాయ్‌, వికాస్‌ మర్మత్‌, వి.అభిషేక్‌, జి.సూర్యసాయి ప్రవీణ్‌ చంద్‌, సి.విష్ణు చరణ్‌ కట్టా సింహాచలం, అపరాజిత సింగ్‌ సిన్సివర్‌, భావన వశిష్ట్‌ ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *