నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు.. నేటి నుంచి 4 రోజులు సెగలు.. పొగలే..

vartha vihari :  ఓవైపు కోవిద్-19 విజృంభిస్తోంది. భారత్ లో మృత్యు ఘంటికలు మోగిస్తోంది. మరోవైపు ఎండలు మండుతున్నాయి. వేసవి ఠారెత్తిస్తోంది. ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోయాయి. వడగాలులు ఉధృతమయ్యాయి. వెచ్చటి గాలులతో రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారింది. వచ్చే నాలుగు రోజుల్లో భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది.

కాగా.. పడమర, వాయవ్య దిశల నుంచి వీస్తున్న పొడిగాలులతో కోస్తా ప్రాంతం ఉడికిపోతోంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం వరకు వేడి గాలులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ‘ఉమ్‌ఫాన్’ తుఫాను బలహీనపడటంతో వేసవి తీవ్ర ప్రభావం చూపుతోంది. గురువారం కోస్తాలో పలుచోట్ల సాధారణంకంటే 3 నుంచి 6 డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. విదర్భ, తెలంగాణలో కొనసాగిన వడగాడ్పుల ప్రభావం కోస్తా వరకు విస్తరించింది.

మరోవైపు.. ప్రజలు వడగాలుల బారిన పడకుండా, డీహైడ్రేట్‌ కాకుండా ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకుంటూ, నీడలో ఉండాలని విపత్తుల నిర్వహణ శాఖ సూచించింది. ఎండలో బయటి నుంచి వచ్చిన వెంటనే నిమ్మరసముగాని, కొబ్బరి నీరు లేదా చల్లని నీరు త్రాగాలి. మరో రెండురోజులపాటు కోస్తాలో వడగాడ్పులు వీస్తాయని విశాఖ తుఫాన్‌ హెచ్చరిక కేంద్రం డైరెక్టర్‌ విజయభాస్కర్‌ తెలిపారు. 24వరకు వడగాడ్పులు కొనసాగి తరువాత క్రమేపీ తగ్గుతాయని ఇస్రో నిపుణులు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *