సర్వీసులు నిలిచినా ఉద్యోగుల జీతాల్లో కోత లేదు

VARTHA VIHARI : ముంబై : బడ్జెట్ ధరల విమానయాన సంస్థ ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ లిమిటెడ్‌ (ఇండిగో) కు  కోవిడ్- 19  సెగ భారీగానే తాకింది. ఒకవైపు దేశీయంగా, అంతర్జాతీయంగా సర్వీసులు నిలిచిపోవడంతో ఆదాయంలో గణనీయంగా కోత పడగా.. దీనికి తోడు దేశీయ విమాన కార్యకలాపాలు నిలిచిపోవడంతో  ఇవాల్టి  ఈక్విటీ మార్కెట్‌లో ఇన్వెస్టర్లు ఇండిగో షేర్లలో అమ్మకాలకు దిగారు.  దీంతో ట్రేడింగ్‌ ప్రారంభంలోనే దాదాపు 8 శాతం పతనమైంది. అమ్మకాల ఒత్తిడి నుంచి కోలుకున్పప్పటికీ ఇండిగో ఇంకా నష్టాల్లోనే కొనసాగుతుండటం గమనార్హం. ప్రస్తుతం ఇండిగో 4 శాతం పైగా నష్టంతో రూ.882 వద్ద ట్రేడవుతోంది. ఈ ప్రభావం కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ పై కూడా చూపుతుంది.

మరోవైపు మార్చి 31 వరకు సర్వీసులను నిలిపివేసినప్పటికీ, ఉద్యోగులకు మాత్రం ఇండిగో భారీ ఊరటనిచ్చింది. వారి జీతాల్లో ఎలాంటి కోత విధించబోమని సంస్థ ప్రకటించింది. సెలవుల్లో కూడా ఎలాంటి కోత విధించబోమని  హామీ ఇచ్చింది. ముఖ్యంగా వచ్చే నెలకు సంబంధించి అడ్వాన్స్‌ బుకింగ్స్‌ మెరుగ్గానే ఉన్నాయని ఇండిగో సీఈవో రనుంజాయ్ దత్తా తన ఉద్యోగులకు అందించిన ఈమెయిల్‌లో వెల్లడించారు. ఏప్రిల్‌లో మళ్లీ సర్వీసులను పునరుద్ధరించే యోచనలో ఉన్నామన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు, ప్రాణాంతక వైరస్ వ్యాప్తి  నివారణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నామనీ, కరోనాపై ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని  ఇండిగో కోరింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *