‘రైతు బజార్ల వికేంద్రీకరణకు సీఎం జగన్‌ ఆదేశాలు’

VARTHA VIHARI : తాడేపల్లి : రాష్ట్రంలో కరోనా వైరస్‌ నివారణ చర్యలపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి   బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, ప్రభుత్వ సలహాదారులు అజేయ కల్లాం, సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, వైద్య ఆరోగ్యశాఖ, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సామాజిక దూరం పాటిస్తూ ఈ సమావేశం సాగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణకు సంబంధించి తీసుకుంటున్న చర్యలపై సీఎం జగన్‌ అధికారులతో చర్చించారు. అలాగే లాక్‌డౌన్‌ అమలుపై సీఎం జగన్‌ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

ఈ సమీక్ష అనంతరం ఆళ్ల నాని మీడియాతో మాట్లాడుతూ.. రైతు బజార్ల వికేంద్రీకరణకు సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాలిచ్చారని తెలిపారు. ప్రజలంతా సామాజిక దూరం పాటించాలని కోరారు. నిత్యావసర వస్తువులు ఎక్కువ ధరలకు అమ్మితే కఠిన ధరలు ఉంటాయని హెచ్చరించారు. ఎవరైనా ఎక్కువ ధరలకు అమ్మితే 1902 టోల్‌ ఫ్రీ నెంబర్‌కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ప్రజలంతా సామాజిక దూరం పాటించాలని కోరారు. ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూడకుండా ఉండేందుకు.. నిత్యావసర వస్తువులు, రైతు బజార్లను ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు తెరిచి ఉంచాలని సీఎం ఆదేశించినట్టు తెలిపారు.

ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా రైతు బజార్లను వికేంద్రీకరణ చేయాలని సీఎం జగన్‌ చెప్పారని వెల్లడించారు. ప్రజలు గుంపులు గుంపులుగా ఉండొద్దని సూచించారు. నిత్యావసర వస్తువుల కోసం రెండు, మూడు సార్లు బయటకు రావొద్దని కోరారు. ఒక వాహనంపై ఒక్కరే ప్రయాణించాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *