మే నాటికి 13 లక్షల కేసులు ……

VARTHA VIHARI : న్యూఢిల్లీ : ప్రాణాంతక కరోనా వైరస్‌ వ్యాప్తిని తొలి దశలోనే కట్టడి చేసేందుకు భారత్‌ చేసిన కృషి ప్రశంసనీయమని.. అయితే మహమ్మారి  ఇలాగే విస్తరిస్తే మే సగం నాటికి 13 లక్షల కేసులు నమోదయ్యే అవకాశం ఉందని శాస్తవేత్తలు హెచ్చరించారు. ఇతర దేశాలతో పోలిస్తే ఈ అంటువ్యాధిని అరికట్టడానికి భారత్‌ పటిష్ట చర్యలు తీసుకుంటున్నా కరోనా పరీక్షలను తరచుగా నిర్వహించడంతో బాగా వెనుకబడిందని అభిప్రాయపడ్డారు. మార్చి 18 నాటికి కేవలం 11,500 కరోనా పరీక్షలు మాత్రమే నిర్వహించారని పేర్కొన్నారు. ఈ మేరకు…  ‘‘కోవిడ్‌-19కు ఇంతవరకు వ్యాక్సిన్‌ గానీ.. మందుగానీ కనుగొనలేదు. ఈనేపథ్యంలో రెండో దశ, మూడో దశలో వైరస్‌ వ్యాప్తిని అరికట్టనట్లయితే భారత్‌లో పరిస్థితులు దారుణంగా ఉంటాయి’’ అని కోవ్‌-ఇండ్‌-19 భారత మేధావులు, డేటా సైంటిస్టుల సముదాయం హెచ్చరించింది.  అదే విధంగా అగ్రరాజ్యం అమెరికా, ఇటలీలో ఈ మహమ్మారి క్రమక్రమంగా విస్తరిస్తూ ఒక్కసారిగా విస్పోటనం చెందింది. భారత్‌ కూడా కరోనా వ్యాప్తిని త్వరగా కట్టడి చేయకపోతే ఇలాంటి ఫలితాలే చవిచూడాల్సి వస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ముఖ్యంగా వృద్ధులు ఈ మహమ్మారి బారిన పడకుండా జాగ్రత్త వహించాలని పేర్కొన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే భారత జనాభాకు తగినట్లుగా వైద్య సదుపాయాలు అందుబాటులో లేవని.. ఇక్కడ ప్రతీ వెయ్యి మందికి 0.7 ఆస్పత్రి బెడ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. ఇక కరోనా ప్రభావం వైద్య సిబ్బందిపైనే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. కాగా కరోనాను కట్టడి చేసే చర్యల్లో భాగంగా భారత్‌ మంగళవారం రాత్రి నుంచి 21 రోజుల పాటు లాక్‌డౌన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక కోవిడ్‌-19 ఇటలీలో మరణ మృదంగం మోగిస్తున్న విషయం తెలిసిందే. సోమవారం రాత్రి వరకు అక్కడ ఆరువేల కరోనా మరణాలు నమోదు కాగా.. 60వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. ఈ అంటువ్యాధిపై స్థానిక ప్రభుత్వం, ప్రజలు తొలి నుంచి అప్రమత్తంగా ఉండకపోవడంతోనే ఈ పరిస్థితి ఎదురైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *