కేజ్రీ కేబినెట్‌లోకి చిచ్చరపిడుగు..!

VARTHA VIHARI : న్యూఢిల్లీ : ముచ్చటగా మూడోసారి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ బాధ్యతలు స్వీకరించనున్నారు. అఖండ విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ.. జాతీయ పార్టీలకు దిమ్మతిరిగే షాకిచ్చింది. ఈ నెల 16న కేజ్రీవాల్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇదిలా ఉంటే కేజ్రీ కేబినెట్‌లో కొత్తవారికి ఛాన్స్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఆప్ విజయంలో కీలక పాత్ర పోషించిన యువనాయకుడు రాఘవ్ చద్దాకు ఆర్థిక శాఖ పగ్గాలు అప్పజెప్పనున్నట్టు ప్రచారం జరుగుతోంది. 31 ఏళ్ల రాఘవ్.. రాజీందర్ నగర్ నియోజకవర్గం నుంచి 20వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచిన ఈ యువనేత… ఆప్ అధికార ప్రతినిధి కూడా. ప్రచారంలో తన వాగ్దాటితో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించారు. ఆప్ సర్కార్ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలపై తనదైన శైలిలో ప్రచారం చేసి.. ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేశారు.

చార్టెడ్ అకౌంటెంట్ అయిన రాఘవ్.. పార్టీలో అత్యంత ముఖ్యుడు. గత కేబినెట్‌లో కొన్ని రోజులు ఆర్థికశాఖ సలహాదారుగా కూడా పని చేశారు. తాజాగా ఎమ్మెల్యేగా గెలుపొందడంతో కీలకమైన ఆర్థికశాఖ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలను రాఘవ్ కొట్టిపడేశారు. అవన్నీ ప్రచారం మాత్రమేనని తెలిపారు. ఊహాజనిత ప్రశ్నలకు తాను సమాధానం ఇవ్వలేనని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తాము కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ విజయాన్ని ఆస్వాదిస్తున్నామని.. ఇది ఆప్ సైనికుల విజయమంటూ తన వినమ్రతను చాటుకున్నారు.

మరోవైపు ఆప్‌లో నెంబర్ టూగా ఉన్న సిసోడియా గత ప్రభుత్వంలో పలు శాఖలను నిర్వహించారు. ఆర్థికం, ప్లానింగ్, పట్టణాభివృద్ధి శాఖ, విద్య, రెవెన్యూ శాఖల బాధ్యతలను ఆయనే చూసుకున్నారు. అయితే ఈసారి  ఆర్థిక శాఖ బాధ్యతలను రాఘవ్ చద్దాకు, విద్యాశాఖను అతిషికి ఇచ్చే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావలసి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!