డియర్ ఇండియన్స్.. మరో డేంజర్ బెల్ కు రెడీ కండి

VARTHA VIHARI NEWS : మనం జాగ్రత్తగా ఉంటే సరిపోదు. ఎదుటోడు కూడా అంతే జాగ్రత్తగా ఉన్నప్పుడు మాత్రమే మనం సేఫ్. మన దారిన మనం పోతున్నా.. ఎదుటి నుంచో.. వెనుక నుంచో.. పక్క నుంచో ఇష్టారాజ్యంగా వచ్చే వారి కారణంగా ప్రమాదాలకు గురై.. అప్పుడప్పడు ప్రాణాలు పోగొట్టుకుంటున్న దుర్మార్గ కాలమిది. ఇలాంటి వేళ.. మనకేమాత్రం సంబంధం లేని రెండు దేశాల మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణం మనకు తలనొప్పిగానే కాదు.. జేబు మీద మోయలేనంత భారం పడేలా పరిస్థితులు మారనున్నాయన్న సంకేతాలు ఇప్పుడు భయాందోళనలకు గురయ్యేలా చేస్తున్నాయి.
దేశ ప్రజల మీద పెట్రోల్.. డీజిల్ బాంబులు పడనున్నాయా? అంటే అవునని చెప్పాలి. నిత్యవసరమైన పెట్రోల్.. డీజిల్ ధరలు భారీగా పెరగటమే కాదు.. రికార్డు స్థాయిలో లీటరు వందకు చేరుకునే దుర్దినం దగ్గరల్లోనే ఉందన్న భయాందోళనలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. దీనికి కారణం లేకపోలేదు.
అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో ఈ ధరా భారం దేశ ప్రజల మీద పడే అవకాశం పెద్ద ఎత్తున ఉందన్న మాట బలంగా వినిపిస్తోంది. యూపీఏ సర్కారుకు భిన్నంగా ఎన్డీయే ప్రభుత్వం ఉండటం.. చమురు బిల్లు విషయంలో ప్రభుత్వం భారం మోయటానికి సిద్ధంగా లేకపోవటమే కాదు.. ఎంత అవకాశం ఉంటే అంత ఎక్కువగా ప్రజల నుంచి పన్నుల రూపంలో పీల్చేసేలా ప్లాన్ చేస్తున్న పరిస్థితి.
ఈ కారణంగానే అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు కనిష్ఠంగా ఉన్నప్పటికీ పెట్రోల్ డీజిల్ ధరలు పెద్ద ఎత్తున పెరిగిపోవటం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో సౌదీ చముర నిక్షేపాలపై ఇరాన్ జరిపిన దాడి కారణంగా.. ఆ భారం దేశ ప్రజల మీద పడే ప్రమాదం పొంచి ఉందని చెబుతున్నారు. సౌదీ అరేబియా మీద ఇరాన్ దాడి చేయటం.. ఈ కారణంగా సౌదీలోని చమురు ఉత్పత్తి సగానికి పడిపోవటం తెలిసిందే. దీంతో ముడి చమురు ధరలు భగ్గుమనటమే కాదు.. 48 గంటల్లో బ్యారెల్ కు 12 డాలర్లుచొప్పున పెరగటం ఒక పరిణామం కాగా.. ఈ ఉదంతంలో పలు మార్కెట్లు.. వివిధ దేశాల కరెన్సీలు కుప్పకూలాయి.
మరోవైపు ట్రంప్ హెచ్చరిక నేపథ్యంలో ఇరాన్ వర్సెస్ సౌదీ మధ్య యుద్ధ మేఘాలు అలుముకుంటే.. దాని ప్రభావం భారత్ మీద తప్పనిసరిగా ఉంటుంది. మన దేశానికి వచ్చే ముడిచమురులో సౌదీ భాగస్వామ్యం ఎక్కువే. ధరా భారం డైరెక్ట్ గా ప్రజల మీద పడే ప్రమాదం ఉండటంతో లీటరు పెట్రోల్.. డీజిల్ వంద మార్క్ ను దాటినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు. అదే జరిగితే.. వివిధ రంగాలు పెద్ద కుదుపునకు లోను కావటం ఖాయమని చెప్పక తప్పదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!