టీటీడీ చైర్మన్ ఇంట్లో అఘోరాల పూజలు

VARTHA VIHARI : టీటీడీ చైర్మన్,  సీఎం జగన్ బాబాయి వైవీ సుబ్బారెడ్డి కొన్ని నెలలుగా నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ఎన్నికల సమయంలో ఆయన జగన్‌పై అసంతృప్తిగా ఉన్నారని ప్రచారం జరిగింది. జగన్ సీఎం అయిన తరువాత కూడా సుబ్బారెడ్డి ప్రాధాన్యం తగ్గింది.. అయితే, అది బయటపడకుండా ఆయనకు టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చారనీ చెబుతారు. ఆయన టీటీడీ చైర్మన్ అయిన తరువాత ఆయన మతంపైనా వివాదం ఏర్పడింది. తాను హిందువునేనంటూ ఆయన వివరణ కూడా ఇచ్చుకున్నారు. తాజాగా సుబ్బారెడ్డి ఇంట్లో అఘోరాలతో పూజలు చేయించారని.. ఆయన్ను అఘోరాలు ఆశీర్వదించారంటూ అందుకు సంబధించిన ఫొటోలు కూడా నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ప్రచారమవుతున్నాయి.
సుబ్బారెడ్డి ఇంట్లో పూజలు చేయడానికి హిమాలయాల నుంచి అఘోరాలు వచ్చారంటూ వైసీపీ వర్గాల్లోనూ ప్రచారమవుతోంది. ఇంట్లో ప్రత్యేక పూజల అనంతరం వైవీ సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులు అఘోరాల ఆశీస్సులు తీసుకుంటున్న ఫొటోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. అఘోరాల ఆశీస్సులు అందుకుంటున్న టీటీడీ చైర్మన్ ఫొటోలు వైరల్ కావడంతో ఈ విషయం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అఘోరాలు వైవీ సుబ్బారెడ్డి తలపై చేయి పెట్టి ఆశీర్వదిస్తున్న ఫొటో వైరల్ అయింది.
విజయవాడలోని సుబ్బారెడ్డి ఇంటికి వారు ఆయన ఆహ్వానం మేరకే వెళ్లినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలోనే వైవీతోపాటు ఆయన కుటుంబ సభ్యులు కలిసి అఘోరాల సమక్షంలో ప్రత్యేక పూజలు చేశారట. అనంతరం వారి ఆశీర్వాదాలు కూడా తీసుకున్నారట. గతంలో చంద్రబాబు హయాంలో ఓ టీడీపీ నేత ఇంట్లో కూడా ఇలాగే అఘోరాలు పూజలు చేశారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అప్పుడు ఆ ఘటన పెను సంచలనం సృష్టించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!