తిరుమలను జల్లెడపడుతున్న ‘అక్టోపస్‌’

VARTHA VIHARI NEWS :

అక్టోపస్‌ కమాండోలు.. ముష్కరుల జాడ కనిపించిన సందర్భాల్లో ఈ పదాన్ని ఎక్కువగా వింటుంటాం. ఉగ్రవాదుల ఏరివేతకు సంబంధించిన ఆపరేషన్లకు అక్టోపస్‌ కమాండోలు రంగంలో దిగుతారు. కఠోర శిక్షణ పొందిన వీరు ఆయుధాలు, టెక్నాలజీని వినియోగించి అమాయకులకు ఎలాంటి నష్టం లేకుండా ఉగ్రవాదులను మట్టుపెడతారు. తిరుమల కొండకు ముష్కరుల నుంచి ముప్పు ఉందనే కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో టీటీడీ వినతి మేరకు అక్టోపస్‌ కమాండో బృందాలను తిరుమలకు రప్పించారు. కొండపై భద్రతను మరింత కట్టుదిట్టం చేయటంలో భాగంగా ఈ కమాండోలతో ప్రస్తుతం నిరంతర పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నారు.
40 మంది కమాండోల రాక
తిరుమల క్షేత్రానికి ముష్కరుల నుంచి ముప్పు ఉన్నప్పుడు భక్తుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి అలజడి లేకుండా ప్రమాదాన్ని ఎదుర్కొనేలా అక్టోపస్‌ దళాల సేవలు వినియోగించుకోవాలని టీటీడీ 2010లో నిర్ణయించింది. తరచూ ఉగ్ర హెచ్చరికలు వస్తున్న నేపథ్యంలో అక్టోపస్‌ కమాండోలను కేంద్ర ప్రభుత్వ సహకారంతో తిరుమలకు రప్పించారు. ఓ డీఎస్పీ, సీఐ, ఇద్దరు ఎస్‌ఐలతో కలిపి దాదాపు 40 మంది అక్టోపస్‌ కమాండోలు తిరుమల క్షేత్రంలోనే అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. వీరు నెలకోసారి రాత్రి వేళల్లో మాక్‌డ్రిల్‌ కూడా నిర్వహిస్తున్నారు. భారీ భవనాలపైకి రోప్‌ సహాయంతో ఎక్కడం, దిగటంతో పాటు ఉగ్రవాదులు ప్రవేశిస్తే కట్టడి చేయాల్సిన తీరుపై అప్పుడప్పుడు డ్రిల్స్‌ నిర్వహిస్తుంటారు. అలాగే శారీరక ధృడత్వం కోసం నిరంతరం వ్యాయామాలు, క్రీడల్లో పాల్గొంటూ తిరుమలలోనే అందుబాటులో ఉంటున్నారు.
 
పుత్తూరు ఘటనతో వెలుగులోకి
తిరుమలలో అక్టోపస్‌ కమాండోలు ఉన్నారనే విషయం 2013లో వెలుగులోకి వచ్చింది. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను టార్గెట్‌ చేసుకున్న కొందరు ఉగ్రవాదులు పాతదుస్తులు, కోళ్లవ్యాపారం పేరుతో 2013లో పుత్తూరులో మకాం పెట్టిన విషయం అప్పట్లో కలకలం రేపింది. గరుడసేవకు చెన్నైనుంచి వచ్చే గొడుగుల్లో బాంబులు అమర్చేందుకు కుట్రపన్నినట్టు తెలుసుకున్న నిఘా వర్గాలు అప్పట్లో తమిళనాడు, ఏపీ పోలీసులను అప్రమత్తం చేశాయి. ఆ తరుణంలో పుత్తూరులో ఓ ఇంట్లో దాగిఉన్న ఉగ్రవాదులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించి అప్పటికే తిరుమలలో ఉన్న అక్టోపస్‌ కమాండోలకు సమాచారం ఇచ్చారు.
దాంతో తిరుమల నుంచి వెళ్లిన కొన్ని బృందాలు ఇద్దరు ఉగ్రవాదులను చాకచక్యంగా పట్టుకోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తిరుమలలో అక్టోపస్‌ కమాండోల నిఘా ఉందని ఈ ఘటనతోనే అందరికీ తెలిసింది. ఆ ఘటన తర్వాత కేవలం ఉగ్రవాదుల ఆపరేషన్లకే పరిమితం కాకుండా అనుకోకుండా ఏదైనా విపత్తులు జరిగినా వీరి సహకారం తీసుకోవాలని టీటీడీ భావించింది. ఈ క్రమంలోనే మొదటిఘాట్‌లోని అవ్వాచారి లోయలో పడిపోయిన ఓ యువతిని వీరు కాపాడి అందరి ప్రశంసలు అందుకున్నారు.
 
తాజాగా తిరుమలను జల్లెడ పడుతున్న కమాండోలు
దేశంలో ఎక్కడైనా ఉగ్రవాదుల కదలికలపై అలజడి రేగితే తిరుమలలో అక్టోపస్‌ కమాండోలు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో కమాండోలతో తిరుమలను జల్లెడ పట్టించాలని టీటీడీ భద్రతాధికారులు భావించారు. ఈ క్రమంలోనే ఉదయం, సాయంత్రం వేళల్లో శ్రీవారి ఆలయ పరిసరాలతో పాటు తిరుమల మొత్తం పెట్రోలింగ్‌ నిర్వహించాలని ఆదేశాలు జారీచేశారు. దాంతో కమాండోలు కొన్ని బృందాలుగా విడిపోయి గత కొద్దిరోజులుగా తనిఖీలు చేస్తున్నారు. పైగా ఈ పెట్రోలింగ్‌ ద్వారా తిరుమలలోని అన్ని ప్రాంతాలపై కమాండోలకు అవగాహన వస్తుందని అధికారులు చెప్తున్నారు. అలాగే శ్రీవారి దర్శనార్థం వీవీఐపీలు వచ్చిన సందర్భాల్లోనూ వీరు ఆలయం వద్ద నిఘా ఉంచుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!