వీఐపీలపై వైవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు

VARTHA VIHARI NEWS : టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మొన్ననే వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తామని సంచలన వ్యాఖ్యలు చేసిన ఆయన… తాజాగా మరో సంచలన వ్యాఖ్య చేశారు. వీఐపీలు ఎక్కువగా రావడం వల్ల సామాన్య భక్తులు ఇబ్బంది పడుతున్నారని… వారు ఏడాదికి ఒకసారి మాత్రమే దర్శనానికి వస్తే బాగుంటుందని సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. పదే పదే వీఐపీలు దర్శనానికి వస్తే భక్తులకు ఇబ్బంది కలుగుతుందని ఆయన పేర్కొన్నారు.
సామాన్య భక్తులకు స్వామి వారి సత్వర దర్శనం కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తామని వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. శ్రీవారి దర్శనం విషయంలో వినూత్న మార్పులు తెస్తామన్నారు. వీఐపీలు సహకరిస్తే సామాన్యులకు మేలు జరుగుతుందని సుబ్బారెడ్డి సూచించారు.
అయితే, ఇప్పటికే తిరుమలలో త్వరలోనే ఎల్1,ఎల్2,ఎల్3 బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తామని ఆయన ఇటీవలే పేర్కొన్న విషయం విదితమే. దాని స్థానంలో మరో విధానం ప్రవేశపెడతారు. స్వయంగా వీఐపీలు దర్శనానికి వచ్చే వర్గం ఒకటి, వీఐపీ రెకమెండేషన్లు మరో వర్గంగా పరిగణిస్తారు. అయితే ఈ విధానం ఎంతవరకు అమలుకు నోచుకుంటుందో చూడాలి. ఎందుకంటే కొందరు స్వయంగా వీఐపీలు కాకపోయిన పరపతి పరంగా ప్రాధాన్యం కలిగి ఉంటారు. వీరిని ఏ వర్గంలో పరిగణిస్తారు అనేది కూడా పాయింటే. సామాన్యులకు అవకాశం కల్పించాలనుకోవడం ఉత్తమ నిర్ణయమే గాని, ఆచితూచి సాధ్యాసాధ్యలను పరిగణలోకి తీసుకుని ముందుకు వెళితే అన్ని విధాలా శ్రేయస్కరమని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!