ఏపీ క్రీడలకు బ్రాండ్ అంబాసిడర్‌గా పీవీ సింధు!?

VARTHA VIHARI NEWS:భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధూను ఏపీ క్రీడలకు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించాలని సీఎం వైఎస్ జగన్‌ను కోరతానని క్రీడల శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఆదివారం ఉదయం ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒలింపిక్ డే రన్ జరిగింది. మహాత్మా గాంధీ రోడ్డులో ఇందిరాగాంధీ స్టేడియం నుంచి డీవీ మానర్ హోటల్‌ వరకు రన్ ప్రారంభమైంది. మంత్రులు ధర్మాన కృష్ణ దాస్, అవంతి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మల్లాది విష్ణు, కలెక్టర్ ఇంతియాజ్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి.సింధు, ఆర్చరీ క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ హాజరయ్యారు.

కార్యక్రమంలో భాగంగా మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఒలింపిక్ రన్‌లో క్రీడాకారులు అందరూ ఉత్సాహంతో పాల్గొన్నారని చెప్పుకొచ్చారు. ఒలింపిక్ అసోసియేషన్‌లో గత నాలుగేళ్లల్లో ఎన్నో రాజకీయాలు, వివాదాలు నడిచాయన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏకగ్రీవంగా ఒలింపిక్ అసోసియేషన్ కార్యవర్గం ఏర్పాటు చేశామని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. నూతన ఒలింపిక్ అసోసియేషన్ చైర్మన్‌గా విజయసాయి రెడ్డి, అధ్యక్షుడిగా ధర్మాన కృష్ణ దాస్‌ను ఎన్నుకోవడం జరిగిందన్నారు.

వైఎస్ జగన్ కూడా..!

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి కూడా ఉదయాన్నే వ్యాయామం చేసిన తర్వాతే తన దినచర్య పాటిస్తారని ఈ సందర్భంగా మంత్రి చెప్పుకొచ్చారు. జగన్ అన్ని వేల కిలోమీటర్ల పాదయాత్ర చేయడానికి ఆయనలో ఉన్న ఫిట్‌నెస్ ఒక కారణమన్నారు. క్రీడలకు సీఎం ఎంతో ప్రాధాన్యత ఇస్తారని ఏపీకి పతకాలు సాధించేలా ప్రోత్సహిస్తామన్నారు. విద్యార్దులకు చదువుతో పాటు క్రీడలను కూడా తప్పనిసరి చేయాలన్నారు. అంతటితో ఆగని ఆయన.. తెలంగాణలో ఎంతోమంది ఆత్మహత్య చేసుకున్నారంటే.. ‌వారిలో ఫిజికల్, మెంటల్ ఫిట్‌నెస్ లేకపోవటం కూడా ఒక కారణమన్నారు. అందుకే పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులను క్రీడల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలని మంత్రి అవంతి చెప్పుకొచ్చారు.
జగన్ సీఎంగా ఉండటం మన అదృష్టం!
కార్యక్రమంలో భాగంగా ధర్మాన కృష్ణ దాస్ మాట్లాడుతూ.. ఒలింపిక్ డే రన్ ద్వారా క్రీడలపై మరింత ఆసక్తిని పెంపొందిస్తామన్నారు. క్రీడల ద్వారానే అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి దక్కుతుందన్నారు. ఫిజికల్, మెంటల్ ఫిట్‌నెస్ సాధించాలంటే క్రీడలు ఎంతో అవసరమని.. తాను కూడా క్రీడాకారునిగా ఉంటూ ఉద్యోగం కూడా సంపాదించానన్నారు. క్రీడలను ప్రోత్సహించే వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సీఎంగా ఉండటం మన అదృష్టమన్నారు. ప్రభుత్వం అన్ని విధాలా క్రీడాకారులకు అవసరమైన చేయూతను ఇస్తుందని మంత్రి ధర్మాన చెప్పుకొచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *