ఆఫ్ఘనిస్థాన్ తో ఉత్కంఠ పోరులో భారత్ విజయం….

VARTHA VIHARI NEWS:పసికూన ఆఫ్ఘనిస్థాన్ టీమిండియాకు టెన్షన్ తెప్పించింది. తుదికంటా ఉత్కంఠభరితంగా సాగిన పోరులో భారత్ 11 పరుగుల తేడాతో గెలిచింది. చివరి ఓవర్ లో మొహమ్మద్ షమీ హ్యాట్రిక్ సాధించి ఆఫ్ఘనిస్థాన్ ఆశల సౌధాన్ని కుప్పకూల్చాడు. వరల్డ్ కప్ 2019లో ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ ఓడిపోని భారత్ రికార్డును పదిలం చేశాడు. శనివారం జరిగిన మ్యాచ్ లో ఈ విజయంతో భారత్, వరల్డ్ కప్ లో తన 50 విజయాల మైలురాయిని చేరుకుంది. 

శనివారం సౌథాంప్టన్ లోని ద రోజ్ బౌల్ లో ఆఫ్ఘనిస్థాన్ తో మ్యాచ్ అంతా అనుకున్నట్టు తేలికగా సాగలేదు. బడా బడా జట్లనే చిత్తు చేసిన టీమిండియా ఆఫ్ఘన్లను ఆటాడుకుని సెమీస్ దిశగా దూసుకెళ్తుందని అంతా భావించారు. కానీ ఆఫ్ఘన్ స్పిన్నర్లు అదరగొట్టారు. భారత్ బ్యాటింగ్ బాహుబలులని కట్టిపడేశారు. దీంతో భారత జట్టు 50 ఓవర్లలో 8 వికెట్లకు 224 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ తర్వాత మొహమ్మద్ నబీ హాఫ్ సెంచరీ చేసి ఆఫ్ఘనిస్థాన్ పోరాటాన్ని చివరి ఓవర్ వరకు తీసుకెళ్లాడు.  జస్ప్రీత్ బుమ్రా కట్టుదిట్టంగా వేసిన 49వ ఓవర్ తో ఆఫ్ఘన్లపై ఒత్తిడి పెరిగింది. 50వ ఓవర్ వేసిన షమీ హ్యాట్రిక్ సాధించి 1987 వరల్డ్ కప్ లో హ్యాట్రిక్‌ సాధించిన చేతన్ శర్మ రికార్డును సమం చేశాడు.

తమ రెండో వరల్డ్ కప్ ఆడుతున్న ఆఫ్ఘనిస్థాన్ టాస్ ఓడిపోయింది. కానీ 50 ఓవర్లలో 8 వికెట్లు తీసి టీమిండియాను 224 పరుగులకే పరిమితం చేసింది. దీంతో అంతా భారత్ కు షాక్ ఖాయమనే అనున్నారు. ఆ తర్వాత బ్యాటింగ్ కి దిగి 29వ ఓవర్ లో 2 వికెట్లు కోల్పోయి 106 పరుగులు చేసింది. కానీ బూమ్ బూమ్ బుమ్రా ఒకే ఓవర్ లో రహ్మత్ షా, హష్మతుల్లా షహీదీల వికెట్లు తీసి భారత జట్టు ఆశలకు ఊపిరులూదాడు. మొహమ్మద్ నబీ, నజీబుల్లా జాద్రాన్ ఆచితూచి ఆడుతూ స్కోరును ముందుకు నడిపించారు. హార్దిక్ పాండ్యా వేసిన 42వ ఓవర్ లో జాద్రాన్ యుజ్వేంద్ర చహల్ కు క్యాచ్ ఇచ్చి ఔటైనపుడు ఆఫ్ఘనిస్థాన్ స్కోరు 6 వికెట్లకు 166. 

చివరి ఓవర్ వరకు క్రీజులో ఉన్న నబీ, విజయానికి 16 పరుగులు అవసరం కాగా షమీ మొదటి బంతిని ఫోర్ కొట్టాడు. రెండు బంతుల తర్వాత నబీ లాంగాన్ లో పాండ్యాకి క్యాచ్ ఇచ్చాడు. ఆ తర్వాత షమీ ఆఫ్తాబ్ ఆలమ్, ముజీబుర్ రెహ్మన్ లను క్లీన్ బౌల్డ్ చేసి హ్యాట్రిక్ సాధించడంతో పాటు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో జట్టుకి విజయం సాధించి పెట్టాడు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!