ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమల స్థాపనకు అనుకూల మైన వాతావరణం ఉంది……

VARTHA VIHARI NEWS:ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన వాతావరణం, మానవ వనరులు, కోస్టల్ కారిడార్, సాంకేతిక నైపుణ్యత కలదని కేంద్ర రైల్వే, వాణిజ్య, పరిశ్రమల శాఖా మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం స్థానిక గ్రాండ్ రిడ్జ్ హోటల్ లో ఆంధ్రప్రదేశ్ లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు సంబందించి పారిశ్రామిక వేత్తలతో ముఖాముఖి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా కేంద్ర రైల్వే మంత్రి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో యువ పారిశ్రామికవేత్తలకు ఎన్నో అవకాశాలు కలవని, రానున్న రోజుల్లో వ్యవసాయ అనుబంద రంగాల్లో మరియు సోలార్ ఆధారిత పరిశ్రమల స్థాపనకు మంచి ప్రాదాన్యత ఉంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్ లో వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి నేతృత్వంగల నూతన ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలుపుతూ కేంద్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి అందిస్తుందన్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని అంశాలపై మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న దీర్ఘకాలిక పెండింగ్ అంశాలపై దృష్టి సారిస్తుందన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో నూతన ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత తిరుపతిలో మొదట పారిశ్రామికవేత్తలతో సమావేశం చేస్తున్నామని తెలిపారు. తిరుపతి నగరం ఆద్యాత్మిక నగరమని, ఆదేవుని ఆశీశులు అందరిమీద ఉండి దేశం, రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనించాలన్నారు. వెనుకబడిన ప్రాంతాల్లో పరిశ్రమల అభివృద్ధికి ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించే విషయమై చర్చించాలన్నారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమల స్థాపన ద్వారా ఎక్కువ మందికి ఉపాధి కల్పించే పరిశ్రమలకు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. అనంతపురంలో కియా మోటార్స్ వద్ద అప్రోచ్ రోడ్డు రైల్వే అండర్ బ్రిడ్జ్ ను మరింత వెడల్పు, ఎత్తు పెంచాలని కియా మోటార్స్ ఎం.డి. కేంద్ర మంత్రిని అభ్యర్థించగా 40 రోజులలోపు రైల్వే అండర్ బ్రిడ్జ్ ని వెడల్పు , ఎత్తు పెంచి పనులను పూర్తి చేయాలని రైల్వే అధికారులను కేంద్ర మంత్రి ఆదేశించారు.
ఈ-వెహికల్స్ మీద త్వరలో ప్రభుత్వపాలసీ ని ప్రకటిస్తామని, ఆటొ మొబైల్ ఇండస్ట్రికి సంబందించి యాంటీ డంపింగ్ డ్యూటి విధించే విషయమై పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు. దీని ద్వారా ఆటొ మొబైల్ ఉత్పత్తుల రంగానికి మేలు చేకూర్చే విధంగా విధానాన్ని ప్రకటిస్తామన్నారు. నూతనంగా ఏర్పేడులో ఏర్పాటుచేయబోతున్న Rockman Industries వారు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం తెలిపారు.
ఎంఎస్ఎంఈ ఎంటర్ప్రైజర్స్ మరియు ఎగుమతి ఆదారిత పరిశ్రమలకు తక్కువ వడ్డీ రేటు తో రుణాలు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం బ్యాంకులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉన్నదని , ఈ స్థానాన్ని ఈ విధంగా కొనసాగించే విధంగా కృషి చేయాలన్నారు. అదే విధంగా దేశ సమగ్రాభివృద్ధి కొరకు జిల్లాల వారీగా ర్యాంకులను వచ్చే సంవత్సరంలో లో ప్రకటించనున్నామని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం ఏంఎస్ఏం ఈ లకు అందిస్తున్న మార్కెటింగ్ సౌకర్యం (Government E-Marketing) ద్వారా దేశ వ్యాప్తంగా ప్రభుత్వ సంస్థలు, కార్పొరేషన్ల ద్వారా సంవత్సరానికి 25 వేల కోట్ల మార్కెటింగ్ సౌకర్యం కల్పించడం జరిగింది. భౌగోళికంగా, సామాజికంగా అతి పెద్ద దేశమైన భారతదేశంలో జీఎస్టీ ని విజయవంతంగా అమలు చేస్తున్నామన్నారు.
రాష్ట్ర పరిశ్రమలు , ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల స్థాపన ద్వారా ఎక్కువ మందికి ఉపాధి కల్పన దిశగా పనిచేస్తున్నదని, అవినీతికి తావు లేకుండా పారదర్శకమైన పాలనను అందిస్తూ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను అమలు చేస్తామన్నారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమల స్థాపనకు వచ్చే ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ కంపెనీల నుండి వచ్చిన పారిశ్రామికవేత్తలు ప్రస్తుతం కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న విధానాలపై వారు పొందిన ప్రయోజనాలను మరియు చిన్న మధ్య తరహా పరిశ్రమలకు అందించాల్సిన ప్రోత్సాహకాలను మంత్రి దృష్టి కి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో డిపీఐఐటీ జాయింట్ సెక్రెటరీ అనిల్ అగర్వాల్, ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల మౌలిక సదుపాయాలు మరియు పెట్టుబడుల శాఖ ప్రిన్సిపాల్ సెక్రెటరీ డా.రజిత్ భార్గవ, ఇండస్ట్రీస్ కమీషనర్ సిద్ధార్థ జైన్, జిల్లా కలెక్టర్ డా.నారాయణ్ భరత్ గుప్త, జెసీ గిరీషా, తిరుపతి మున్సిపాల్ కమీషనర్ విజయరామరాజు, తిరుపతి సబ్ కలెక్టర్ డా.మహేష్ కుమార్ , అమరరాజా బ్యాటరీస్ ఛైర్మన్ గల్లా రామచంద్ర నాయుడు, శ్రీ సిటీ – రవి సన్నారెడ్డి , రోబోటిక్- బాల సుబ్రమణ్యం, వివిధ కంపెనీలకు చెందిన సీఈఓ లు, బీజేపీ ప్రతినిధులు భాను ప్రకాష్ రెడ్డి , శాంతా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!