శ్రీవారి ఆలయంలో ఘనంగా జ్యేష్ఠాభిషేకం ప్రారంభం….

VARTHA VIHARI NEWS:తిరుమల శ్రీవారి ఆలయంలో మూడు రోజుల పాటు జరుగ‌నున్న‌ జ్యేష్ఠాభిషేకం శుక్ర‌వారం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆలయంలోని సంపంగి ప్రదక్షిణంలో ఉన్న కల్యాణమండపంలో ఉదయం, సాయంత్రం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.ఇందులో భాగంగా ఉదయం ఋత్వికులు యాగశాలలో శాంతిహోమం నిర్వహించారు. శతకలశ ప్రతిష్ఠ ఆవాహన, నవకలశ ప్రతిష్ఠ ఆవాహన, కంకణ ప్రతిష్ఠ అనంతరం స్వామి, అమ్మవార్లకు అర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం చేసి కంకణధారణ చేశారు. ఆ తరువాత శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారికి వేడుకగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో వేదపండితులు శ్రీసూక్తం, భూసూక్తం, పురుష సూక్తం, నీలా సూక్తం, నారాయణసూక్తాలను పఠిస్తుండగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో ఉత్సవమూర్తులకు విశేషంగా అభిషేకం చేపట్టారు.కాగా, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు వజ్రకవచాన్ని అలంకరిస్తారు. సహస్రదీపాలంకార సేవ అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారి ఉత్సవమూర్తులు వజ్రకవచంలో ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు. ఇదిలా ఉండగా శ‌నివారం ముత్య‌పుకవచంతో, ఆదివారం స్వర్ణకవచంతో స్వామి, అమ్మవార్లు భక్తులకు దర్శనమిస్తారు. జ్యేష్ఠాభిషేకం కారణంగా శుక్ర‌వారం నిజ‌పాద ద‌ర్శ‌నం, వసంతోత్సవం ఆర్జితసేవల‌ను టిటిడి రద్దు చేసింది.ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్, శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, ఆలయ ప్రధానార్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్‌, పేష్కార్ శ్రీ లోక‌నాథం ఇతర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!