సత్ప్రవర్తన దిశగా సాగడమే రంజాన్ మాసం ఉద్దేశం – నగర మేయర్ అబ్దుల్ అజీజ్

VARTHA VIHARI NEWS:పవిత్ర ఆరాధన, ధార్మిక చింతన, దైవభక్తి, క్రమశిక్షణ, దాతృత్వాలకు ఆలవాలంగా నిలవడమే ముస్లింల పవిత్ర రంజాన్ నెల ఉద్దేశమని, మనిషి సత్ర్పవర్తన దిశలో సాగడానికి మహమ్మద్ ప్రవక్త బోధించిన మార్గాన్ని పండుగ మాసం సుగమం చేస్తుందని నగర మేయర్ అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు. రంజాన్ మాసపు ఉపవాసాలను పూర్తి చేసేందుకు స్థానిక మూలపేటలోని నూరుల్ హుదా అరబిక్ కళాశాలలో ఆదివారం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ కఠినమైన ఉపవాస విధి పూర్తి చేసుకుని జరుపుకునే ఇఫ్తార్ విందుతో ప్రతిఒక్కరిలో పరస్పర సోదరభావం, ఆత్మీయత, సహృద్భావాలు వెల్లుబుకుతాయని, పరస్పర ధోరణికి, విశాల ఆలోచనా దృక్పథానికి ఆ కలయికలు నిదర్శనంగా నిలుస్తాయని ప్రకటించారు. అదేవిధంగా పేదవారు సైతం పండుగను సంతోషంగా జరుపుకోవడమే ‘జకాత్’ ప్రధాన ఉద్దేశ్యమని, తిండి బట్టకు నోచుకోని అభాగ్యులను ఆదుకోవడం నిష్టతో కూడిన నియమం అని మేయర్ వెల్లడించారు. అదేవిధంగా ప్రస్తుతం ఉన్న వేసవి తీవ్రత దృష్ట్యా సామాజిక సేవా తత్పరత కలిగిన ప్రతిఒక్కరూ బాధ్యతగా భావిస్తూ నగర వ్యాప్తంగా తమతమ ప్రాంతాల్లో మంచినీటి చలివేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజల దాహార్తిని తీర్చాలని పిలుపునిచ్చారు. ఎండలు తీక్షణంగా ఉన్న కారణంగా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ఎక్కువగా మంచినీరు, మజ్జిగ లాంటి ద్రవాలను మోతాదు మేరకు కచ్చితంగా తీసుకుని సేదతీరాలని సూచించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!