55 వేలకే కిడ్నీ ఆపరేషన్‌!

VARTHA VIHARI NEWS:విశాఖ కిడ్నీ రాకెట్‌లో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. నగరంలోని శ్రద్ధ ఆస్పత్రిలో 2012 నుంచే కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేస్తున్నట్టు తేలింది. ఇప్పటివరకు 66 శస్త్రచికిత్సలు నిర్వహించినట్లు వెల్లడైంది. వీటిలో 16 ఆపరేషన్లు ఎన్‌టీఆర్‌ వైద్య సేవ కింద చేయగా, మిగిలినవి డబ్బు తీసుకుని చేసినట్లు విచారణ బృందం గుర్తించినట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై కలెక్టర్‌ కె.భాస్కర్‌ ఏర్పాటుచేసిన త్రిసభ్య కమిటీ సభ్యులు కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ అర్జున్‌, జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ తిరుపతిరావు, ఏపీయూపీ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ బీకే నాయక్‌ బుధవారం సాయంత్రం శ్రద్ధ ఆస్పత్రిని సందర్శించింది. అక్కడి వ్యవహారాలపై 30 ప్రశ్నలతో కూడిన ప్రశ్నావళిని ఇంతకు ముందే సిబ్బందికి అందించింది. వాటికి సమాధానాలతో పాటు, రికార్డులను అందించాలని అప్పుడే ఆదేశించింది. బుధవారం వాటి గురించి ప్రశ్నించగా.. రికార్డులు సిద్ధంగా లేవని, సమయం కావాలని సిబ్బంది కోరారు. దాంతో కమిటీ సభ్యులు గురువారం సాయంత్రం వరకు గడువిచ్చారు.

ఈ సందర్భంగా ఇప్పటివరకు ఎన్ని కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేసిందీ ఆరా తీశారు. అందుబాటులో ఉన్న కొన్ని రికార్డులను పరిశీలించగా.. ఒక్కొక్క కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌కు రూ.55 వేలు మాత్రమే వసూలు చేసినట్లు రికార్డుల్లో నమోదు చేసి ఉంది. అది చూసి అధికారులు విస్తుపోయారు. రూ.లక్షలు తీసుకునే ఈ ఆపరేషన్‌కు రూ.55 వేలు తీసుకోవడం ఏమిటని సిబ్బందిని ప్రశ్నించారు.
ప్రస్తుతం విచారణ జరుగుతున్న పార్థసారథి కేసు వివరాలు కోరగా.. పోలీసు అధికారుల దగ్గర ఉన్నాయని సిబ్బంది చెప్పారు. దాంతో కమిటీ సభ్యులు నేరుగా మహారాణిపేట పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి సీఐ కేశవరావును కలసి మాట్లాడారు. త్రిసభ్య కమిటీ విచారణకు శ్రద్ధ ఆస్పత్రి యాజమాన్యం అసలు సహకరించడం లేదు. ఎండీ, ఇతర కీలకమైన వైద్యులు పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలిసింది. ఉన్నవారిలో కూడా ఎవరూ విచారణకు సహకరించడం లేదు. కమిటీ విచారణకు వస్తున్నదని తెలిసినా ఎవరూ అక్కడ అందుబాటులో లేరు. రిసెప్షనిస్ట్‌ తనకు ఏమీ తెలియదని చెప్పడంతో కమిటీ సభ్యులు ఆశ్చర్యపోయారు. పార్థసారథి కేసుకు సంబంధించి కేజీహెచ్‌ నుంచి కిడ్నీ మార్పిడికి అనుమతి తీసుకోలేదని తేలింది.
కేసు మాఫీకి రంగంలోకి దళారులు:
ఇటువంటి కేసులు బయటపడినప్పుడు అన్ని శాఖల అధికారులను సముదాయించి, కేసు పెద్దది కాకుండా చూసే దళారులు కొందరు… రంగ ప్రవేశం చేశారు. యాజమాన్యం తరఫున వకాల్తా పుచ్చుకుని కేసు నుంచి అందరినీ తప్పిస్తామంటూ బేరసారాలు సాగిస్తున్నారు. కాగా.. ఈ కేసులో ఉన్నవారు స్వచ్ఛందంగా లొంగిపోతే బాగుంటుందని, లేకపోతే అరెస్టు చేసి జైలుకు పంపాల్సి వస్తుందని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!