ఘనంగా ముగిసిన శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు

VARTHA VIHARI NEWS:శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయ మహోత్సవం బుధ‌వారం నాడు తిరుమలలో ఘనంగా ముగిసింది. సాయంత్రం 4.30 గంటలకు శ్రీవారి ఆలయం నుండి స్వామివారు గరుడవాహనంపై, దేవేరులు పల్లకీపై ఊరేగింపుగా బయల్దేరి నారాయణగిరి ఉద్యానవనంలోని పద్మావతీ పరిణయోత్సవ మండపానికి వేంచేపు చేశారు. ముందు రెండురోజుల మాదిరే ఎదుర్కోలు, పూల చెండ్లాట, నూతన వస్త్ర సమర్పణ తదితర పెండ్లి వేడుకలు ఘనంగా ముగిసిన తరువాత కొలువు జరిగింది. వెంటనే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదాలను పారాయణం చేశారు. నాదస్వరం కళాకారులు నీలాంబరి, భూపాల, మధ్యమావతి తదితర రాగాలను పలికించారు. ఆ తరువాత అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమాచార్య కీర్తనలు వినిపించారు.ఈ వేడుక ముగిసిన తరువాత స్వామి దేవేరులతో కలిసి ఊరేగుతూ ఆలయ ప్రవేశం చేస్తారు. దీంతో మూడురోజుల పద్మావతీ పరిణయోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ ఉత్సవాల కారణంగా శ్రీవారి ఆలయంలో ఆర్జిత బ్రహ్మూెత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది.ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్‌, విజివో శ్రీ మ‌నోహ‌ర్‌, పేష్కార్ శ్రీ లోక‌నాథం, ఆలయ ఒఎస్‌డి శ్రీ పాల శేషాద్రి,  ఇతర అధికారులు, విశేష సంఖ్య‌లో భక్తులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *