ఓటు వేస్తే అందరూ ఒక్కవేలే చూపిస్తారు.. కానీ రాహుల్ ఇలా….

VARTHA VIHARI NEWS:లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో తనదైన శైలిలో దూసుకెళ్తున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇవాళ మరోసారి తన మార్కు చూపించారు. ఢిల్లీలో జరిగిన ఆరో విడత పోలింగ్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్న ఆయన… సిరాగుర్తును వినూత్నంగా చూపించారు. సాధారణంగా ఓటు వేసిన తర్వాత అందరూ ఎడమచేతి చూపుడు వేలిపై ఉన్న సిరాగుర్తును చూపిస్తారు. కానీ రాహుల్ అన్ని వేళ్లు కలిపి చూపిస్తూ కెమేరాలకు ఫోజిచ్చారు. హస్తం గుర్తు ప్రతిబింబించేలా.. అందునా విమర్శలకు అవకాశం లేకుండా చూసుకునేలా రాహుల్ ఇలా చేసినట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా ఓటు వేసిన అనంతరం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ..‘‘ఎన్నికల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ విద్వేషాన్ని వెళ్లగక్కారు. కానీ మేము ప్రేమను పంచిపెట్టాం. ఈ సారి ఎన్నికల్లో ప్రేమే గెలుస్తుందని అనుకుంటున్నాను…’’ అని వ్యాఖ్యానించారు. తుగ్లక్ లేన్ నివాసం నుంచి తనదైన స్టైల్లో కుర్తా-పైజమా ధరించి బయల్దేరిన రాహుల్… న్యూఢిల్లీ కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ మాకెన్‌తో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చారు. ‘‘ ఈ సారి ఎన్నికల్లో ప్రధానంగా నాలుగు సమస్యలను లేవనెత్తాం. ఇవి మా సమస్యలు కాదుగానీ.. ప్రజల సమస్యలు. వీటిలో ప్రధానమైనది నిరుద్యోగ సమస్య. రైతుల దయనీయ పరిస్థితి, నోట్లరద్దు, గబ్బర్ సింగ్ ట్యాక్స్ (జీఎస్టీకి రాహుల్ పెట్టిన పేరు), అవినీతి, రాఫెల్ ఒప్పందం తదితర సమస్యలను మేము ప్రధానంగా లేవనెత్తాం..’’ అని ఈ సందర్భంగా రాహుల్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *