నేడు, రేపు మంటలే

VARTHA VIHARI NEWS:భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఉదయం నుంచే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతోంది. మరో రెండు రోజులు ఎండ మంటలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశంలో కోర్‌హీట్‌ వేవ్‌ జోన్‌లో ఉన్న కోస్తా ప్రాంతం… తుఫాను అనంతరం వీస్తున్న వాయవ్య గాలులతో ఉడికిపోతోంది. కొన్నిచోట్ల పగటి ఉష్ణోగ్రతలు గత రికార్డులకు చేరువగా నమోదవుతున్నాయి. ఈ సీజన్‌ ముగిసేలోగా ఎండలు మరింత పెరిగి, పాత రికార్డులను అధిగమించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. గురువారం ఏకంగా 52ప్రాంతాల్లో 45- 47 డిగ్రీల మధ్య, 225 ప్రాంతాల్లో 43- 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తాడేపల్లిగూడెంలో అత్యధికంగా 47డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జంగమహేశ్వరపురంలో 44.6, కావలిలో 44.4డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.ఏపీఎ్‌సడీపీఎస్‌ స్టేషన్లలో పశ్చిమగోదావరి జిల్లా జగ్గన్నపేటలో 46.92, చిత్తూరు జిల్లా నిండ్రలో 46.85, కర్నూలు జిల్లా దిన్నెదేవరపాడులో 46.79, ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో 46.67 డిగ్రీలు నమోదయ్యాయి. కాగా, ఈనెల 10, 11 తేదీల్లో ఉష్ణోగ్రతలు ఇంకా పెరిగే అవకాశం ఉందని ఆర్టీజీఎస్‌ హెచ్చరింది. 48డిగ్రీల వరకూ నమోదు కావొచ్చని అంచనా వేసింది. 10న ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లోనూ, 11న తూర్పుగోదావరి, గుంటూరు, ప్రకాశం, నెల్లూ రు, చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాల్లో 46-48డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటాయని వాతావరణశాఖ పేర్కొంది. ఒడిసా నుంచి కోస్తా మీదుగా రాయలసీమ వరకు ద్రోణి కొనసాగుతోంది. ఎండ తీవ్రతతో వాతావరణ అనిశ్చితి ఏర్పడి అక్కడక్కడా ఉరుములు, ఈదురుగాలులతో వర్షాలు కురిశాయని వాతావరణశాఖ తెలిపింది. రానున్న మూడు రోజుల్లో పలుచోట్ల ఈదురుగాలులు, పిడుగులతో వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!