వీరాభిమాని కోరిక తీర్చిన మెగాస్టార్.. ఏంచేశాడంటే..

VARTHA VIHARI NEWS:అందరు హీరోలకు అభిమానులుంటారు. వివిధ రూపాల్లో తమ తమ అభిమానాన్ని చూపుతుంటారు. కొన్ని సందర్భాల్లో ఆ అభిమానం మరింత ఎక్కువై.. తమ అభిమాన హీరోని కలవాలని ఆయనతో కాసేపు ముచ్చటించాలని ఆశ పడుతుంటారు. ఈ కోవలోనే తాజాగా మెగాస్టార్ చిరంజీవి వీరాభిమాని ఒకరు తన కొడుకుకు చిరంజీవి చేతులమీదుగానే నామకరణం జరగాలని పట్టుబట్టి కూర్చున్నాడు. ఎవరెంత చెప్పినా వినకుండా ఇందుకోసమే గత కొంతకాలంగా వేయి కళ్లతో వేచి చూస్తున్నాడు సదరు వ్యక్తి. అయితే ఎలాగోలా ఈ విషయం మెగాస్టార్ చిరంజీవి వరకూ వెళ్లడంతో.. మెగా మనసు చేసుకొని నేరుగా అతన్ని ఇంటికి పిలిపించుకొని అతని కుమారుడికి పవన్ శంకర్ అనే నామకరణం చేశారు చిరు. మెగాస్టార్ నుంచి పిలుపు రావడం, పైగా తమ కుటుంబంతో కలిసి మెగాస్టార్ కాసేపు గడపడమే గాక తాను కోరుకున్నట్లుగా తన కుమారుడికి నామకరణం చేయడం పట్ల సదరు వ్యక్తి ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.

తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట మండలం మందపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి నక్కా వెంకటేశ్వరరావు. ఈయన చిన్నప్పటి నుండి మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని. చిరు.. ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సమయంలో కూడా పార్టీ అభివృద్ధికి విశేషంగా కృషి చేయగా ఆ గ్రామంలో ఇతన్ని 5 సంవత్సరాల కాలం రాజకీయంగా వెలివేయడం జరిగింది. అప్పట్లో ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి తన ఇంటికి పిలిపించికొని రోజంతా ఆశ్రయమిచ్చి సర్వ మర్యాదలు చేసి అతని కుటుంబ సభ్యులందరికీ బట్టలు పెట్టి పంపించడం జరిగింది. కాగా గత సంవత్సరం ఇదే నెలలో వెంకటేశ్వర రావుకు బాబు పుట్టాడు. అయితే అతనికి మెగాస్టారే నామకరణం చేయాలి లేదంటే ఎన్ని రోజులైనా వేచి ఉంటానని అతను పట్టుబట్టాడు. దీంతో చివరికి ఈ రోజు (సోమవారం) మరోసారి మెగాస్టార్ నుంచి అతనికి పిలుపు రావడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *