ఐదు కేంద్రాల్లో రీపోలింగ్‌!

VARTHA VIHARI NEWS:రాష్ట్ర వ్యాప్తంగా ఐదు పోలింగ్‌ కేంద్రాల్లో రీపోలింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘానికి సిఫారసు చేసినట్లు ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది వెల్లడించారు. గుంటూరు జిల్లాల్లో రెండు, నెల్లూరు జిల్లాల్లో రెండు, ప్రకాశం జిల్లాలో ఒక పోలింగ్‌ కేంద్రంలో రీపోలింగ్‌ కోసం సీఈసీకి సిఫారసు చేశామన్నారు. మంగళవారం అమరావతి సచివాలయంలో ద్వివేది విలేకరులతో చిట్‌చాట్‌ చేశారు. రీపోలింగ్‌ అంశంపై ఆయా జిల్లాల కలెక్టర్లు పరిశీలన చేసిన తర్వాత నివేదిక పంపించారని, ఆ నివేదికను సీఈసీకి నివేదించామని ఆయన తెలిపారు. ‘కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఈ రీపోలింగ్‌కు సంబంధించిన ఆదేశాలు రావాల్సి ఉంది. విశాఖ, మచిలీపట్నం, నెల్లూరు జిల్లాల్లో జరిగిన ఎన్నికల నిర్వహణ ఘటనలపై ఈసీకి నివేదిక పంపించాం. ఈసీ ఆదేశాల మేరకు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలుంటాయి. స్ట్రాంగ్‌ రూముల్లో ఉన్న ఈవీఎంలను ఎక్కడ ఉన్న వాటిని అక్కడే ఉంచాలని ఆయా జిల్లాల అధికారులను ఆదేశించాం. ఇతర రాష్ట్రాల్లో తదుపరి దశల్లో జరిగే పోలింగ్‌ కోసం ఏపీలో ఉపయోగించని ఈవీఎంలను తరలించాల్సి వస్తే రాజకీయ పార్టీలు, పోటీ చేసిన అభ్యర్థులు, మీడియా, అధికారుల సమక్షంలో పరిశీలించి వాటిని తరలిస్తాం.స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద భద్రత కట్టుదిట్టం చేశాం. అదనపు భద్రత కల్పించాలని రాజకీయ పార్టీలు కోరాయి. దీనిపై డీజీపీని నివేదిక అడిగాం. విధుల్లో చిన్న పొరపాటు జరిగినా కఠిన చర్యలుంటాయి. నెల్లూరు జిల్లా ఆత్మకూరు వీవీప్యాట్‌ స్లిప్పుల విషయంలో ఇప్పటికే రిటర్నింగ్‌ అధికారి, అదనపు రిటర్నింగ్‌ అధికారులపై కేసు నమోదైంది. ఘటన జరిగిన తర్వాత ఆధారాలు దొరకకుండా స్లిప్పులను తగులబెట్టే ప్రయత్నం చేశారు. జిల్లా కలెక్టర్‌ ఎన్వలప్‌ కవర్లను పరిశీలించగా, రెండు ఎన్వలప్‌ కవర్లలో స్లిప్పులు తగ్గాయి. ఎన్నికల విధుల్లో చిన్నచిన్న పొరపాట్లు జరిగి ఉండొచ్చు. అధిక సమయం పట్టినా పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు ఓపిగ్గా వేచి ఉండటం సంతోషదాయకం. సిబ్బంది కూడా పోలింగ్‌ పూర్తయ్యేంత వరకూ నిబద్ధతతో వ్యవహరించి అందరికీ ఓటు హక్కు కల్పించారు’ అని ద్వివేది చెప్పారు.

ఆత్మకూరు ఆర్డీవో, తహశీల్దార్లపై కేసు

ఆత్మకూరులో బయటపడ్డ వీవీప్యాట్‌ స్లిప్పుల వ్యవహారంలో ఆ నియోజకవర్గ ఎన్నికల అధికారి, ఆత్మకూరు ఆర్డీవో చిన్నరాముడు, ఆత్మకూరు సహాయ ఎన్నికల అధికారి, తహశీల్దార్‌ విద్యాసాగర్‌పై పోలీసులు క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. ఒకటి, రెండు రోజుల్లో వీరిని అరెస్ట్‌ చేయడంతోపాటు విధుల నుంచి సస్పెండ్‌ చేయనున్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించి సదరు స్లిప్పులను బయట పడేయడమే కాకుండా ఉన్నతాధికారుల ఉత్తర్వులు లేకుండా వాటిని తగలబెట్టేశారు. దీంతో ఆ స్లిప్పులు ఎక్కడివి, ఎన్ని ఉన్నాయి అనే ఆధారాలు లేకుండా పోయాయి. దీనిని సీఈవో తీవ్రంగా పరిగణించారు. ఈ క్రమంలో ఆత్మకూరు పోలీ్‌సస్టేషన్‌లో ప్రజాప్రాతినిధ్య హక్కు చట్టంలోని 182, 134, 136 సెక్షన్లు, ఐపీసీలోని 379, 427, 120బీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా, పోలింగ్‌ సందర్భంగా కోవూరులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు ఉద్యోగులను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రేవు ముత్యాలరాజు సస్పెండ్‌ చేశారు.
నాలుగు రోజుల్లో దర్యాప్తు పూర్తి: ఐజీ
నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో వీవీప్యాట్‌ స్లిప్పులు బయటకు ఎలా వచ్చాయన్న దానిపై పోలీసు దర్యాప్తు వేగవంతంగా జరుగుతోందని గుంటూరు రేంజ్‌ ఐజీ రాజీవ్‌ కుమార్‌ మీనా మంగళవారం  మీడియా తెలిపారు. మూడు, నాలుగు రోజుల్లో దర్యాప్తు పూర్తి చేస్తామన్నారు. టీఎన్‌ఎ్‌సఎ్‌ఫ జిల్లా అధ్యక్షుడు కాకర్ల తిరుమలనాయుడుపై దాడి, నెల్లూరు నగరంలో శాంతిభద్రతల సమస్య, ఆత్మకూరులో వీవీప్యాట్‌ స్లిప్పులు బయటకు రావడం తదితర అంశాలపై జిల్లా అధికారులతో సమీక్షించారు. కాగా, వీవీప్యాట్‌ స్లిప్పుల వ్యవహారం నెల్లూరు జిల్లాలో కొత్త అనుమానాలకు ఆస్కారం కలిగిస్తోంది. పోలింగ్‌ నిర్వహణలో ఇంకేమైనా తప్పులు జరిగాయా..!? అని ఉద్యోగవర్గాల్లో కలవరం మొదలైంది.పోలింగ్‌కు ముందు ఈవీఎం మిషన్లలో క్లియర్‌ బటన్‌ నొక్కి అప్పటి వరకు వేసిన మాక్‌పోలింగ్‌ ఓట్ల సంఖ్యను జీరో చేయాలి. ఆ తరువాతే పోలింగ్‌ ప్రారంభించాలి. అది సక్రమంగా జరిగిందా!? లేదా!? అనే విషయంపై ఉన్నతాధికారులు పోలింగ్‌ విధుల్లో పాల్గొన్న రిటర్నింగ్‌ అధికారులను మంగళవారం ఉదయం నుంచి వాకబు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!