వైఎస్ పాత్ర గురించి మమ్ముట్టి ఏం చెప్పాడు?

VARTHA VIHARI NEWS:మ‌మ్ముట్టి.. ఇండియ‌న్ ఫిలిం హిస్ట‌రీలోనే అత్యంత గొప్ప న‌టుల్లో ఒక‌డు. ఆయ‌న ప్ర‌తిభ ఎలాంటిదో మ‌న ప్రేక్ష‌కుల‌కూ బాగానే తెలుసు. దాదాపు మూడు ద‌శాబ్దాల కింద‌ట ఆయ‌న న‌టించిన  స్వాతికిర‌ణం సినిమాను తెలుగు ప్రేక్ష‌కులు అంత సులువుగా మ‌రిచిపోలేరు. ఆ సినిమాతో ఎన‌లేని పేరు సంపాదించిన మ‌మ్ముట్టి.. మ‌ళ్లీ ఇన్నేళ్ల‌కు తెలుగులో ఒక సినిమా చేశారు. అదే.. యాత్ర. ఈ సినిమా ప్ర‌మోష‌న్ కోసం హైద‌రాబాద్‌కు వ‌చ్చిన ఆయ‌న ఇక్క‌డి మీడియాతో ముచ్చ‌టించారు. తెలుగు సినిమాల గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తెలుగులో కొన్నేళ్లుగా మంచి మంచి సినిమాల వ‌స్తున్నాయ‌ని… తాను త‌ర‌చుగా ఇక్క‌డి సినిమాలు చూస్తుంటాన‌ని మమ్ముట్టి చెప్పారు. ఈ మ‌ధ్య కాలంలో మీరు చూసిన తెలుగు సినిమాలేవ‌ని అడిగితే.. రంగ‌స్థ‌లం, భ‌ర‌త్ అనే నేను పేర్లు చెప్పాడు మ‌మ్ముట్టి. ఆ రెండు సినిమాలూ త‌న‌కెంతో న‌చ్చాయ‌న్నారు.
తెలుగు ప‌రిశ్ర‌మ‌లో ర‌క‌ర‌కాల సినిమాలు తెర‌కెక్కుతుంటాయ‌ని.. వాటిని ఇక్క‌డి ప్రేక్ష‌కులు ఆద‌రించే విధానం కూడా చాలా బాగుంటుంద‌ని.. వారికి చ‌క్క‌టి అభిరుచి ఉంద‌ని మ‌మ్ముట్టి కితాబిచ్చారు. ఈ మ‌ధ్య తెలుగు ద‌ర్శ‌కులు మంచి మంచి ప్ర‌యోగాలు చేస్తున్నార‌ని.. అదే స‌మ‌యంలో క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు కూడా తీస్తున్నార‌ని చెప్పారు. తెలుగులో తాను ఇంత గ్యాప్ తీసుకోవ‌డానికి ప్ర‌త్యేక కార‌ణాలేమీ లేవ‌ని.. ఎప్పుడు ఎవ‌రు మంచి పాత్ర‌, క‌థ‌తో వ‌చ్చినా తాను న‌టించ‌డానికి సిద్ధ‌మ‌ని అన్నారు. మ‌హి.వి.రాఘ‌వ్ ప‌క్కా స్క్రిప్టుతో త‌న‌ను క‌లిశాడ‌ని.. వైఎస్ పాత్ర న‌చ్చి సినిమా చేశాన‌ని అన్నారు. మ‌హికి పెద్ద‌గా అనుభ‌వం లేక‌పోవ‌డం గురించి తానేమీ ఆందోళ‌న చెంద‌లేద‌ని.. త‌న కెరీర్లో దాదాపు 70 మంది కొత్త ద‌ర్శ‌కుల‌తో ప‌ని చేశాన‌ని.. వాళ్ల‌తో పోలిస్తే మ‌హికి ఎంతో స్ప‌ష్ట‌త ఉంద‌ని అన్నాడు. మ‌హి ఇంత‌కుముందు చేసిన సినిమాలేవీ కూడా చూడ‌కుండానే.. అత‌డి స్క్రిప్టు న‌చ్చి యాత్ర‌ చేశాన‌ని.. వైఎస్ మాట‌ను, బాడీ లాంగ్వేజ్‌ను అనుక‌రించానికి తాను ప్ర‌య‌త్నించ‌లేద‌ని.. ఆయ‌న పాత్ర‌లోనే ఆత్మ‌ను ప‌ట్టుకుని న‌టించాన‌ని మ‌మ్ముట్టి అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *