కుర్చీల‌కు ఉప‌న్యాసం చెప్పిన బాబు – కాకాణి విమ‌ర్శ‌లు

VARTHA VIHARI NEWS:నెల్లూరులోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాల‌యంలో ఆ పార్టీ జిల్లా అధ్య‌క్షులు, స‌ర్వేప‌ల్లి ఎమ్మెల్యే కాకాణి గోవ‌ర్థ‌న్ రెడ్డి విలేక‌ర్ల స‌మావేశం నిర్వ‌హించారు. ఈసంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ నెల్లూరు జిల్లా బోగోలులో జ‌రిగిన జ‌న్మ‌భూమి ముగింపు స‌భ‌కు జ‌నాన్ని త‌ర‌లించాల‌ని, విఆర్ఓల‌కు, ఎమ్మార్వోకు టార్గెట్ పెట్టార‌ని, ప్ర‌జ‌ల‌ను మ‌భ్య పెట్టి అయినా, స‌భ‌కు త‌ర‌లించాల‌ని ఆదేశించార‌ని తెలిపారు. ఓ వైపు పండుగ సెల‌వుల నేప‌థ్యంలో ప్ర‌యాణికులు ఇబ్బందులు ప‌డుతుంటే, ఆర్టీసీ బ‌స్సుల‌ను జ‌నాల త‌ర‌లింపుకు కేటాయించ‌డం దారుణ‌మ‌ని అన్నారు. ముఖ్య‌మంత్రి ప్ర‌సంగాన్ని విన‌లేక‌, జ‌నం బ‌య‌ట‌కు వెళ్లిపోయార‌ని, ఖాళీ కుర్చీల‌కే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఉప‌న్యాసం చెప్పార‌ని ఎద్దేవ చేశారు. జ‌న్మ‌భూమి కార్య‌క్ర‌మాన్ని చంద్ర‌బాబు రాజ‌కీయ ప్ర‌చారానికి వాడుకున్నార‌ని మండిప‌డ్డారు. 54నెల‌ల కాలంలో ప్ర‌జ‌ల‌కు ఏమి చెప్పాము, ఏమి చేశామో చెప్పి ఉంటే బాగుండేద‌ని కాకాణి అభిప్రాయ‌ప‌డ్డారు. చంద్ర‌బాబు అవిచేస్తామ‌ని, ఇవి చేస్తామ‌ని చెప్పార‌ని, అయితే మంత్రి నారాయ‌ణ ఖ‌జానా ఖాళీ అయ్యింద‌ని, జీతాల‌కు కూడా డ‌బ్బులు లేవ‌ని చెప్పార‌ని, అంటే ఈ జ‌న్మ‌భూమి ముగింపు స‌భ ఓ ఎన్నిక‌ల స్టంట్ అని కాకాణి మండిప‌డ్డారు. జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఏడాది క్రిత‌మే వృద్ధులు, విక‌లాంగుల పెన్ష‌న్ పెంచుతాన‌ని ప్ర‌క‌టించార‌ని, వాటిని కాపీ కొట్టి ఇప్పుడు చంద్ర‌బాబు ప్ర‌క‌ట‌న చేశార‌ని ఆరోపించారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడికి స్వ‌త‌హాగా తెలివితేట‌లు లేవ‌ని, ఆయ‌న చ‌దువునే స‌మ‌యంలోకాపీ కొట్టే పాసై ఉంటార‌ని కాకాణి ఎద్దేవ చేశారు. ముఖ్య‌మంత్రి స‌భ‌కు ఆక్వారైతులు వ‌చ్చి స‌మ‌స్య‌లు చెప్పేందుకు వ‌స్తే, వారిని త‌రిమికొట్టార‌ని ఆగ్ర‌హించారు. జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఆక్వారైతుల స‌మ‌స్య‌ల‌పై స్పందింస్తే, వెంట‌నే చంద్ర‌బాబు దానిపై ప్ర‌క‌ట‌న చేస్తూ, ప్ర‌జ‌ల‌ను మ‌రోసారి మోసం చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని తెలిపారు. 54నెల‌ల కాలంలో పెన్ష‌న్లు పెంచాల‌ని చంద్ర‌బాబుకు ఎందుకు ఆలోచ‌న రాలేద‌ని కాకాణి ప్ర‌శ్నించారు. ఎన్నిక‌ల ముందుకు మ‌హిళ‌ల‌ను మ‌భ్య‌పెడితే గెల‌వ‌చ్చ‌నే ఆలోచ‌న‌తో చంద్ర‌బాబు కుట్ర‌ప‌న్నుతున్నార‌ని తెలిపారు. ఇంతకాలం డ్వాక్రా మ‌హిళ‌కు 10వేలు ఎందుకు ఇవ్వ‌లేద‌ని, రైతు రుణ‌మాఫీ ఎందుకు చేయ‌లేద‌ని ప్ర‌శ్నించారు. మ‌హిళ‌ల‌కు స్మార్ట్ ఫోన్లు ఇస్తాన‌ని చంద్ర‌బాబు చెప్ప‌డం విడ్డూర‌మ‌ని, ఎన్నిక‌ల మ్యానిఫెస్టోలో చంద్ర‌బాబు 2014లో పొందుప‌రిచార‌ని, ఎన్నిక‌లు వ‌స్తున్నాయి కాబ‌ట్టి ఇప్పుడు ఫోన్లు ఇస్తాన‌ని చెప్పార‌ని కాకాణి విమ‌ర్శించారు. కృష్ణ‌ప‌ట్నం పోర్టుకు శంకుస్థాప‌న చేసిన వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి, 5ఏళ్ల కాలంలో దానిని పూర్తి చేసి, జాతికి అంకితం చేశార‌ని, రామాయ‌ప‌ట్నం పోర్టును ఎందుకు పూర్తి చేయ‌లేక‌పోయార‌ని కాకాణి మండిప‌డ్డారు. సిజెఎస్ఎఫ్ ప‌ట్టాల విష‌యంలో టిడిపి నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు చేతివాటం ప్ర‌ద‌ర్శించార‌ని, జిల్లాలో ఇచ్చిన భూముల్లో ఎన్ని వ్య‌వ‌సాయానికి అనుకూలంగా ఉన్నాయో తెల‌పాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అన్నారు. వ్య‌వ‌సాయానికి అనుకూలంగా లేని భూముల‌కు ప‌ట్టాలు ఇస్తే ప్ర‌జ‌ల‌కు ఎందుకు ఉప‌యోగ‌ప‌డుతాయ‌ని కాకాణి ధ్వ‌జ‌మెత్తారు. సంగం, నెల్లూరు బ్యారేజీ పూర్తి చేయ‌లేని చంద్ర‌బాబుకు నెల్లూరు జిల్లా రైతుల‌పై ఎంత ప్రేమ ఉందో ఆర్థం అవుతుంద‌ని తెలిపారు. ఈ బ్యారేజీలో 100 కోట్ల రూపాయ‌ల బిల్లులు ఇంత‌వ‌ర‌కు చెల్లించ‌లేద‌ని, ఉట్టికి ఎక్క‌లేనమ్మ స్వ‌ర్గానికి ఎక్కిన చందంగా చంద్ర‌బాబు తీరు ఉంద‌ని ఎమ్మెల్యే కాకాణి విమ‌ర్శ‌లు గుప్పించారు. ఈ కార్య‌క్ర‌మంలో ప‌లువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!