పేలనున్న ఐపీ బాంబ్‌.. అజ్ఞాతంలోకి బడా పారిశ్రామికవేత్త?

VARTHA VIHARI NEWS :: ✍{వెంక‌ట‌సాయి}✍:: కడప: కడప నగరంలో త్వరలో ఐపీబాంబు పేలనుందా ? పలువురి వద్ద అప్పు తీసుకున్న ఓ పారిశ్రామికవేత్త కుటుంబసభ్యులతో సహా అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో ఔననిపిస్తోంది. నగరంలోని ఎర్రముక్కపల్లె ప్రాంతంలో నివాసం వుంటున్న ఓ పారిశ్రామికవేత్త దాదాపు రూ.35 కోట్లకు పైగా అప్పులు చేసినట్లు చెబుతున్నారు. ఆయనకు రెండు పల్వరైజింగ్‌ ఫ్యాక్టరీలతో పాటు నాలుగు మైన్స్‌ వున్నట్లు తెలుస్తోంది. కడపతో పాటు పులివెందుల ప్రాంతానికి చెందిన పలువురి వద్ద అప్పు చేసినట్లు సమాచారం. ఇలాచాలా మంది వద్ద రూ.35 కోట్ల వరకు అప్పు చేసినట్లు తెలుస్తోంది. దీంతో కుటుంబ సభ్యులతో కలిసి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు చెబుతున్నారు. ఈయనకు అప్పులు ఇచ్చిన వారు లబోదిబోమంటూ మొత్తుకుంటున్నారు. నగరానికి చెందిన ఓ వైద్యుడు దాదాపు రూ.2 కోట్లు అప్పు ఇచ్చినట్లు ప్రచారం వుంది. అలాగే ఓ బ్యాంకులో పనిచేస్తున్న ఉద్యోగి రూ.కోటికి పైగా ఇవ్వగా, పోస్టల్‌లో పనిచేసే ఒకాయన రూ.70 లక్షలు, ఓ వ్యాపారి రూ. 1.30 కోట్లు…. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది పెద్ద సంఖ్యలో అప్పులు ఇచ్చినట్లు తెలుస్తోంది. కొంతమంది మధ్యవర్తులుగా వ్యవహరించి అప్పులు ఇప్పించారు.
ఇలా అతనికి అప్పులు ఇప్పించిన వారంతా ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. ఆ పారిశ్రామికవేత్త ముందస్తుగానే పకడ్బందీగా తనకు సంబంధించిన ఆస్తులను విక్రయించినట్లు చెబుతున్నారు. కడపలోవున్న ఇల్లును రూ.2 కోట్లకు అమ్మేసినట్లు చెబుతున్నారు. పులివెందుల ప్రాంతంలో వున్న భూమిని అక్కడ వున్న ఓ అప్పుదారుకు అమ్మేసినట్లు తెలుస్తోంది. కుటుంబం సహా అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో ఐపీ బాంబు పేలుస్తాడనే భయం అప్పిచ్చిన వారిని వెంటాడుతోంది. ఎవరైనా ఫిర్యాదు చేద్దామంటే అంత సొమ్ము నీకెక్కడిది అంటూ ఎక్కడ ఆదాయపన్ను శాఖాధికారులు విరుచుకుపడతారేమోనన్న భయంతో అప్పిచ్చిన వారు ఆందోళనతో సతమతమవుతున్నారు. ఇప్పుడు ఈ వ్యవహారం అటు పారిశ్రామికవేత్తల్లో… ఇటు రుణదాతల్లో చర్చనీయాంశంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!