పని ఒత్తిడితో ఆత్మహత్య.. బాస్‌ తప్పుకాదు: సుప్రీంకోర్టు వెల్లడి

VARTHA VIHARI NEWS ::✍ {వెంక‌ట‌సాయి}✍:: దిల్లీ: పని ఒత్తిడితో ఉద్యోగి ఆత్మహత్య చేసుకుంటే అది యజమాని తప్పుకాదని స్పష్టంచేసింది సుప్రీంకోర్టు. ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడితే బాస్‌ను తప్పుపట్టలేమని తెలిపింది. ఉద్యోగంలో ఉద్యోగికి యజమాని కానీ పై అధికారి కానీ ఎక్కువ పని అప్పగిస్తే అది ఆత్మహత్యకు ప్రేరేపించే నేరం కాదని పేర్కొంది.

ఈ మేరకు బాంబే హైకోర్టుకు చెందిన ఔరంగాబాద్‌ న్యాయమూర్తుల వాదనను తిరస్కరించింది. 2017 ఆగస్ట్‌లో ఔరంగాబాద్‌కు చెందిన విద్యా శాఖలో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న‌ కిశోర్ పరాషార్‌ ఆత్మహత్య చేసుకున్నారు. పై అధికారుల ఒత్తిడి వల్లే తన భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడని అతని భార్య అధికారిపై కేసు పెట్టింది. పనివేళ్లలో ఉన్నతాధికారులు అధిక పని అప్పగించడం వల్ల తన భర్త మానసికంగా కుంగిపోయాడని ఫిర్యాదులో పేర్కొంది.

వేళ కాని వేళల్లో, సెలవుల్లో అధికారులు ఫోన్‌ చేసి కార్యాలయానికి రమ్మనేవారని, ఒకవేళ విధులకు హాజరుకాకపోతే నెల రోజుల జీతంలో కోత విధిస్తామని బెదిరించేవారని ఆరోపించింది. ఈ బాధలు తట్టుకోలేక ఇంట్లో మౌనంగా ఉండేవారని పేర్కొంది. ఈ మేరకు ఔరంగాబాద్‌ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. దాంతో తనపై నమోదైన కేసును కొట్టివేయాల్సిందిగా అధికారి బాంబే న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కానీ ఇందుకు న్యాయస్థానం ఒప్పుకోలేదు. ఓ ఉద్యోగిని మానసిక ఒత్తిడికి గురిచేయడంతో అతను ఆత్మహత్య చేసుకుంటే అతని యజమాని తప్పే అవుతుందని న్యాయస్థానం పేర్కొంది. దాంతో ఆ అధికారి ఈ కేసును సర్వోన్నత న్యాయస్థానానికి తీసుకెళ్లారు.

జనవరి 23న న్యాయమూర్తులు అరుణ్‌ మిశ్రా, లలిత్‌ పరిశీలించారు. ఈ కేసు విషయంలో బాంబే న్యాయస్థానం ఇచ్చిన తీర్పులో లాజిక్‌ లేదని తాజాగా పేర్కొన్నారు. ‘కార్యాలయంలో ఉద్యోగిని మానసిక ఒత్తిడికి గురిచేసినప్పుడు..అతను ఆత్మహత్య చేసుకుంటే అది యజమాని నేరమే అవుతుంది. ఈ విషయంలో సెక్షన్‌ 306 కింద కేసు నమోదు చేయొచ్చు. కానీ కిశోర్‌ కేసులో అలాంటివేమీ జరగలేదు. ఆఫీస్‌లో ఎక్కువ పని అప్పగిస్తున్నారని అతను ఆత్మహత్య చేసుకుంటే అది ఉన్నతాధికారుల తప్పు కాదు.’ అని వెల్లడిస్తూ అధికారిపై వేసిన కేసును కొట్టివేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *