వ‌ల‌స‌ల‌తో వైసీపీ విష‌మ ప‌రీక్ష‌

VARTHA VIHARI NEWS : ✍ వేణు జోగి ✍ :  అధికారంలో ఉన్నప్పుడు ఏ పార్టీకైనా ఎలాంటి తలనొప్పులు ఉండవు.. అధికారపార్టీ నాయకులు.. కార్యకర్తలు హాయిగా ఉంటారు.. అదే ప్రతిపక్షంలో ఉంటే మాత్రం బోలెడన్ని సమస్యలు.. పార్టీ కార్యక్రమాలకు నిధులు వెచ్చించాలి.. కార్యకర్తలు జారిపోకుండా చూసుకోవాలి.. అధిష్టానం దగ్గర తమ గ్రాఫ్‌ చెదిరిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.. ఇంకా చాలా చాలా చేయాల్సి ఉంటుంది.. ఇంతా చేసి.. పార్టీ కోసం నడుం విరిగేలా కష్టపడినా .. అధిష్టానం అసెంబ్లీ టికెట్‌ ఇస్తుందో లేదో తెలియని పరిస్థితి.. ఇప్పుడు ఆచంట నియోజకవర్గంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. అసెంబ్లీ టికెట్‌పై గంపెడాశలు పెట్టుకున్న కొందరు బడా నేతలు.. కాస్తోకూస్తో పేరున్నవారు పార్టీలోకి వస్తుండటంతో ఇప్పటి వరకు పార్టీని నమ్ముకుని .. పార్టీని అంటిపెట్టుకున్నవారి పరిస్థితి కుడితిలో పడిన ఎలుకలా తయారయ్యింది. దాంతో వారికి పార్టీ పట్ల విధేయతతో ఉండాలో లేదో తెలియడం లేదు.. మరోపక్క ఓ మంత్రిగారికి స్వయానా బావగారు అయ్యే ఓ పెద్దాయన అసెంబ్లీ టికెట్‌పై ఆశతో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు.. మరో బడా వ్యాపారవేత్త కూడా పార్టీలోకి రావడానికి సిద్ధమయ్యారన్న ప్రచారం జోరుగానే సాగుతోంది.. ఇవన్నీ చూస్తుంటే పార్టీలో టికెట్‌ కోసం పోటీ పెరిగి గందరగోళ పరిస్థితులు నెలకొనడం ఖాయంగా కనిపిస్తోంది.
ఆచంట వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌లో రాజకీయాలో రోజుకో మలుపు తిరుగుతున్నాయి. నిన్నమొన్నటి వరకు పెద్దగా పార్టీలో ఎలాంటి అలజడి లేకపోయినా.. ఎన్నికలు ముంచుకొస్తుండటం.. జగన్మోహన్‌రెడ్డి పాదయాత్ర జరుగుతుండటం.. పార్టీలో కొందరు పెద్దలు వస్తుండటంతో నియోజకవర్గంలో కాసింత అలజడి నెలకొంది. అందుకు ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలే ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి.. 2014 ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి ముదునూరి ప్రసాదరాజు పోటీచేశారు. తాజా ఊహాగానాల ప్రకారం చూస్తే ప్రస్తుతం ఆయన ఇక్కడ నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా లేరట! అంతేకాదు, నియోజకవర్గ రాజకీయాలకు ఆయన దూరంగానే ఉంటున్నారట! ఈ పరిస్థితులలో నియోజకవర్గ కన్వీనర్‌గా వీరవాసరం మండల పరిషత్‌ అధ్యక్షుడు కవురు శ్రీనివాస్‌ వ్యవహరిస్తున్నారు. అంతేకాదు.. కొంతకాలంగా నియోజకవర్గంలో అయ్యే ఖర్చులు కూడా ఆయనే చూస్తున్నారట! 2019 ఎన్నికలలో తనకు టికెట్‌ ఇస్తారన్న ఆశతోనే ఆయన పార్టీ బాధ్యతలను భుజస్కంధాలపై వేసుకున్నారట! ఈ పరిస్థితులలో కొంతమంది ఇతర పార్టీల నేతలు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌లోకి రావడం నియోజకవర్గంలో కొంత గందరగోళానికి దారి తీసింది. మంత్రి పితాని సత్యనారాయణకు స్వయానా బావ అయ్యే గుబ్బల తమ్మయ్య ఇటీవల అసెంబ్లీ టికెట్‌పై ఆశతో ఆ పార్టీలో చేరారు. 2009లో అప్పటి ప్రజారాజ్యంపార్టీ తరఫున నరసాపురం లోక్‌సభ స్థానానికి పోటీ చేసిన తమ్మయ్య.. తర్వాత పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశంపార్టీలో చేరారు.
2014 ఎన్నికలలో ఆచంట టికెట్‌ ఇస్తారని ఆశించగా.. సడన్‌గా కాంగ్రెస్‌ నుంచి టీడీపీలోకి వచ్చిన పితాని సత్యనారాయణకు టికెట్‌ లభించింది. దాంతో కినుక వహించిన తమ్మయ్య.. అప్పటి ఎన్నికలలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థులకు పరోక్షంగా ప్రచారం చేశారన్న ప్రచారం సాగింది.. ఎన్నికల తర్వాత కూడా ఆయన టీడీపీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఇప్పుడు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌లో చేశారు. జగన్మోహన్‌రెడ్డి టికెట్‌ హామీ ఇవ్వడం వల్లే ఆ పార్టీలో చేరారని తమ్మయ్య వర్గీయులు చెప్పుకొస్తున్న మాట! ఈ నేపథ్యంలో జిల్లాకు చెందిన బడా వ్యాపారవేత్త, మాజీ ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు కూడా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌లోకి రానున్నారన్న మరో ప్రచారం తెరమీదకు వచ్చింది. గతంలో అత్తిలి ఎమ్మెల్యేగా పని చేసిన శ్రీరంగనాథరాజుకు ఆచంట నియోజకవర్గంలో కొంత క్యాడర్‌ ఉందట! దానికి తోడు ఆర్ధికంగా బలంగా ఉన్న శ్రీరంగనాథరాజుకు టికెట్‌ ఇస్తే.. ప్రస్తుతం సిట్టింగ్‌ ఎమ్మెల్యే పితాని సత్యనారాయణకు గట్టి పోటీ ఇస్తారని రాజకీయవర్గాలలో వినిపిస్తున్న గుసగుసలు.. ఇలా జోరుగా ప్రచారం సాగుతున్నా ఆయన మాత్రం ఎక్కడా నోరు విప్పడం లేదు.. జిల్లాలో జగన్‌ పాదయాత్ర పూర్తయ్యేలోగా దీనికి సంబంధించి ఒక క్లారిటీ వస్తుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.. ఇలా రకరకాల పరిణామాల నేపథ్యంలో ఆచంట వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌లో కొంత గందరగోళం ఉందని ఆ పార్టీ వర్గాలే అంగీకరిస్తున్నాయి.. చూద్దాం ఏం జరుగుతుందో….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!